ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎస్‌ఇసి గ్రీన్‌ సిగ్నల్‌!

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధులకు డిక్లరేషన్‌ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో ఏకగ్రీవాల జాబితాను ఎన్నికల సంఘం పరిశీలించింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అసాధరణ స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ రెండు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై ఎన్నికల సంఘం అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని ఇటీవల అధికారులను ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ పెద్దలకు, ఎస్‌ఇసికి మధ్య వివాదం చెలరేగింది. ఈ వ్యవహరం హైకోర్టు వరకూ వెళ్లింది. మరోవైపు ఇటీవల గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఈరోజు, రేపు డిక్లరేషన్‌ పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని పూతలట్టు నియోజకవర్గంలో 49 గ్రామ పంచాయతీలు, గంగాధర నెల్లూరులో 26, నగరిలో 21, చిత్తూరులో 5, చంద్రగిరిలో 4, సత్యవేడులో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో 17 గ్రామ పంచాయతీలు, బాపట్లలో 15, వేమూరులో 12, పొన్నూరులో 10, తెనాలి 7, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.