‘పంచాయతీ’ ఎన్నికల గుర్తులను రిలీజ్ చేసిన ఎస్ఈసి

ఈనెల 9 వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నిల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు మెంబర్లకు 20 గుర్తులను రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఆయా గుర్తుల మీదనే పోటీ చేయాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఇక అభ్యర్థులకు ప్రకటించిన ఎన్నిక గుర్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

సర్పంచ్ అభ్యర్థులకు గొలుసు, కుర్చీ, బ్యాట్‌, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కొవ్వొత్తులు, నల్లబోర్డు, కప్పుసాసరు, క్యారెట్‌, తాళం చెవి, మొబైల్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష, తిరగలి, కుండ, అరటిపండు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా తదితర గుర్తులను కేటాయించారు.

ఇక వార్డు మెంబర్ అభ్యర్థులకు కుక్కర్‌, గౌను, స్టూలు, బీరువా, ఐస్ క్రీమ్‌, కెటిల్‌, ఇస్త్రీపెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్‌ పొయ్యి, కటింగ్‌ప్లేయర్‌, గరిట, ఎలక్ట్రిక్ స్తంభం, బెండకాయ, బెల్టు, కోటు, డిష్‌ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారంబోర్డు, వయొలిన్ తదితర గుర్తులను అభ్యర్థులకు కేటాయించారు. అయితే, ఈ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను కూడా తీసుకొచ్చారు. దీంతో అభ్యర్థులు విజయంపై కొంత భయాందోళనలు నెలకొన్నాయి. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటాకు ఓటు వెయ్యొచ్చు. అభ్యర్థుల గెలుపోటములు నోటా తేల్చే అవకాశం ఉన్నది.