చెరువులు కబ్జాపై అధికారులకు సెల్ఫీ ఛాలెంజ్

పార్వతీపురం, చెరువులు కబ్జాలపై అధికారులకు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆదివారం ఆ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు వంగల దాలినాయుడు, ఉపాధ్యక్షురాలు రేజేటి దయామని, పట్టణ అధ్యక్షులు సిగడాం భాస్కరరావు, మండలాధ్యక్షులు బలగ శంకరరావు తదితరులు పార్వతీపురం పట్టణంలోని నెల్లిచెరువు వద్ద సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు మరిశర్ల మాలతి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం జరుగుతున్న సెల్ఫీ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో, జిల్లా కలెక్టర్, తాసిల్దార్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న 41 సర్వేనెంబర్ కలిగిన నెల్లిచెరువు కబ్జాకు గురవుతుందన్నారు. పట్టపగలే దర్జాగా కబ్జాదారులు చెరువును ఆక్రమించి పక్కా భవనాలు నిర్మిస్తున్నారన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారుల్లో చలనం లేదన్నారు. దమ్ముంటే నెల్లి చెరువులో కబ్జాలను అరికట్టాలని సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, సచివాలయ అధికారులకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన ఆయా శాఖలకు చెందిన అధికారులు తీసుకుంటున్న జీతానికి కూడా కనీసం పనిచేయటం లేదని ఆరోపించారు. భూగర్భ జలాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జంతు జలజీవరాశులకు తాగునీటిని, రైతులకు సాగునీటిన అందించే చెరువులను కబ్జా చేస్తుంటే సంబంధిత శాఖలకు చెందిన అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ సెల్ఫీ ఛాలెంజ్ కైనా అధికారులు స్పందించి చెరువుల ఆక్రమణలు, కబ్జాలను అరికట్టాలని కోరారు. లేని పక్షంలో న్యాయపరమైన పోరాటానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి దిగుతుందని హెచ్చరించారు.