పోలీసుల ముందే రాజ్‌కుంద్రాతో వాగ్వాదం.. అరిచి, ఏడ్చి రచ్చ చేసిన శిల్పా

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందే రచ్చ రచ్చ చేసింది. పోర్న్ వీడియోల కేసులో తన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడానికి పోలీసులు ఇంటికి రాగానే ఆమె బోరుమని ఏడ్చింది. భర్త రాజ్‌కుంద్రాపై అరిచినట్లు అధికారులు వెల్లడించారు. పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేసే తన భర్త యాప్ హాట్‌షాట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆమె.. నీ వల్ల కుటుంబం పరువు పోయిందని, బిజినెస్ దెబ్బ తింటోందని భర్త రాజ్‌కుంద్రాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అక్కడున్న ఓ అధికారి చెప్పారు.

శుక్రవారం ఆరు గంటల పాటు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పా శెట్టిని ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాజ్‌కుంద్రా.. తాను పోర్న్ వీడియోలు చేయలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కోర్టులో తనపై వేసిన కేసు నిలవదనీ అతను అన్నాడు. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఈ కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.

అయితే ఇంత జరిగినా శిల్పా శెట్టి మాత్రం తన భర్తను వెనకేసుకొచ్చింది. రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోలు చేయలేదని, కాస్త శృంగారం ఎక్కువగా ఉన్న వీడియోలు తీశాడని ఆమె చెప్పింది. అతడు తీసిన వీడియోల కంటే ఓటీటీల్లో వచ్చే కంటెంట్ దారుణంగా ఉంటోందనీ ఆమె అనడం గమనార్హం.