పేద విద్యార్థినికి చేయూతనిచ్చిన హీరో శివ కార్తికేయన్

రీల్‌లో మాత్రమే కాదు రియల్‌లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు కోలీవుడ్ స్టార్స్. సాయం అంటే చాలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ కావాలన్న ఓ పేదింటి విద్యార్థిని కలను నెరవేర్చాడు కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్. తంజావూర్ జిల్లా పేరావురణి సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన సహానా కోరికను తమిళ హీరో తీర్చాడు. 2018లో వచ్చిన గజ తుఫాను కారణంగా వీధి లైట్ల కింద చదివి 524 మార్కులతో ప్లస్ టూ ఉత్తీర్ణత పొందిన సహానా ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 273 మార్కులను సాధించి తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కించుకుంది. సహానా ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ తంజావురులోని ప్రైవేట్ కాలేజీలో నీట్ కోచింగ్ ఇప్పించారు. ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సహానా తెలిపింది.ఈ సాయాన్ని జీవితంలో మరచిపోలేనని చెప్పిన ఈ విద్యార్ధి తన వైద్య విద్యకు అయ్యే ఖర్చుని శివ కార్తికేయన్ భరిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించింది. పేద విద్యార్ధి కలను నెరవేర్చిన శివకార్తికేయన్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది.