నేటి నుంచి వేములవాడలో శివరాత్రి వేడుకలు.. భక్తులకు హెలీకాప్టర్‌ సేవలు

వేములవాడ కల్చరల్‌ : దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడురోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపకాంతుల్లో ఆలయం తణుకులీనుతున్నది. బుధవారం ఉదయం ఉదయం 9 గంటలకు నిశీపూజతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నిశీపూజ అనంతరం లఘుదర్శనం, కోడెమొక్కులు కొనసాగనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు వేములవాడ స్థానిక ప్రజలకు స్వామివారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా అనుమతించనున్నారు. గురువారం తెల్లవారు జామున 3.30గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4.25 నుంచి 6 వరకు ప్రాతఃకాల పూజ జరుగనుంది. శివరాత్రి సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

భక్తులకు హెలీకాప్టర్‌ సేవలు

శివరాత్రి సందర్భంగా వేములవాడలో భక్తులకు హెలీకాప్టర్‌ సేవలు కల్పించారు. మూడురోజుల పాటు భక్తులకు హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జాతరను గగనతలం నుంచి వీక్షించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేసింది. వేములవాడ నుంచి నాంపల్లి వరకు 7 నిమిషాలకు ఒక్కొక్కరికి రూ.3వేలు వసూలు చేయనున్నారు. వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మధ్య మానేరు వీక్షణకు అవకాశం ఉంది. మధ్యమానేరు వీక్షణకు 15 నిమిషాలకు రూ.5,500 వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.