ముంపుకు శాశ్వత పరిష్కారం చూపండి..!

  • చెరువులు, వరహాల గెడ్డ, మెయిన్ రోడ్డు ఆక్రమణలు తొలగించండి
  • మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టండి
  • ముంపు ప్రాంతాల్లో సీసీ కాలువల ఏర్పాటు చేయండి
  • జిల్లా రెవెన్యూ అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం పట్టణానికి ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఆ పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు జిల్లా రెవెన్యూ అధికారి జే.వెంకటరావును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఇటీవల పట్టణం ముంపుకు గురైన సందర్భాన్ని చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలపై ఆక్రమణలు జరగటం మూలంగా పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో పూడికలతో నిండుకున్న కాలువల్లో మురుగునీరు ప్రవహించక ఏమాత్రం వర్షం పడినా వరద నీరు రోడ్డుపైకి వచ్చి ముంపుకు కారణం అవుతుందన్నారు. అలాగే వరద నీరు పట్టణం నుండి బయటకు పోయేందుకు ప్రకృతి ప్రసాదంగా లభించిన వరహాలు గెడ్డ ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు రోడ్డుపైకి వస్తుందన్నారు. అలాగే పట్టణంలోని పలు చెరువులు, ఆక్రమణలకు గురి కావడం జరిగిందన్నారు. ఆయా చెరువుల్లో పక్కా భవనాలు నిర్మించడంతో చెరువుల్లో చేరాల్సిన వర్షం నీరు రోడ్డుపైకి వచ్చి పట్టణాన్ని ముంచేస్తుందన్నారు. అలాగే పట్టణంలోని బైపాస్ కాలనీ, మెయిన్ రోడ్, సౌందర్య సినిమా హాలు ప్రాంతము, నెల్లిచెరువుగట్టు, జనశక్తి కాలనీ తదితర ముంపుకు గురైన ప్రాంతాల్లో సీసీ కాలువలు ఏర్పాటు చేసి ముంపుకు శాశ్వత పరిష్కారం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన డిఆర్ఓ వెంకటరావు తగు చర్యలు చేపడతామన్నారు.