మధురై మీనాక్షి అమ్మవారికి పవన్ కళ్యాణ్ సారె, చీర సమర్పణ

ద్రవిడ వారస ప్రతీకగా, శ్రీ శక్తి నిలయంగా ఆదిదంపతులైన శివపార్వతులే శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సుందరేశ్వర స్వామి వార్లుగా వెలసిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న దక్షిణ భారతదేశంలోని అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మధురై పట్టణంలోని శ్రీ మీనాక్షి అమ్మన్, శ్రీ సోమసుందరేశ్వన్ వార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ శ్రీ మీనాక్షి సోమ సుందరేశ్వరన్ లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శ్రీ మీనాక్షి అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ మొక్కులో భాగంగా అమ్మవారికి సారె, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో ఆలయ రుత్వికులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయంలోనే కూర్చుని పవన్ కళ్యాణ్ పరాశక్తి పారాయణం గావించారు. అనంతరం శ్రీ సోమ సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ సోమ సుందరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని శిల్పకళను, దాని ప్రాశస్త్యం, విశిష్టతలను ఆలయ అధికారులు, పండితులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఆలయంలోని ఉప ఆలయాలను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించి పూజలు చేశారు. ఆలయంలోని ప్రతి శిల్పంలోనూ చారిత్రక విశేషాలు దాగి ఉంటాయి. ఆలయంలోని శిల్పకళ గురించి పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని శ్రీ చక్రానికి పవన్ కళ్యాణ్ గారు సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులను పవన్ కళ్యాణ్ పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

Share this content:

Post Comment