వడ్డేశ్వరంలో శ్రమదానం చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్

  • గతుకులమయమైన రోడ్డుకు మరమ్మతులు
  • విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షలో అమరులైన సైనికాధికారులకు సంతాపం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షకు శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలో గోతులుపడి దెబ్బ తిని ఉన్న ఆర్అండ్బీ రోడ్డుకు ఆదివారం ఉదయం శ్రీ పవన్ కళ్యాణ్ మరమ్మతులు చేశారు. వడ్డేశ్వరం గ్రామానికీ, పలు విద్యాసంస్థలకు వెళ్ళే రోడ్డు ఇది. పార్టీపరంగా నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా ముందుగా శ్రమదానంతో రోడ్డుకి మరమ్మతు చేసి మొదలుపెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షను కూడా వడ్డేశ్వరంలో రోడ్డుకి మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ నేతలు శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ బేతపూడి విజయశేఖర్, శ్రీ అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

  • అమరుల సాహసాలు మరువలేనివి

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షను మొదలుపెట్టారు. ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్న ఆర్మీ హెలీకాప్టర్ దుర్ఘటనలో అమరులైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, మరో 12 మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. మన రాష్ట్రానికి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అమరులైనవారిలో ఉన్నారని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సైనిక దళాల సేవలను, సాహసాలను ఎంతో గౌరవిస్తారు అని, రూ.కోటి సైనిక దళాల సంక్షేమానికి అందచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు రాష్ట్రాల్లో నినదించి, ఉద్యమించారని… ఈ ప్రాంతవాసి అయిన శ్రీ అమృతరావు గారు చేసిన దీక్షను, పోరాటాన్ని స్మరించుకున్నారు. ఈ ఉద్యమంలో అమరులైనవారికి అంజలి ఘటిస్తూ మౌనం పాటించారు.