బాలీవుడ్ సీనియర్ నటుడికి జంటగా శ్రుతిహాసన్!

ఇటీవలి కాలంలో వెబ్ సీరీస్ నిర్మాణం బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుట్టుకురావడం.. కంటెంట్ కోసం పోటాపోటీగా విభిన్న కథాంశాలతో వెబ్ సీరీస్ నిర్మించడం చూస్తున్నాం. బిజీ తారలు సైతం వీటికి సై అంటున్నారు. అదే కోవలో ఇటీవల కథానాయికగా మళ్లీ బిజీ అయిన అందాలతార శ్రుతిహాసన్ కూడా చేరింది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదేళ్ల క్రితం రవి సుబ్రహ్మణ్యం రాసిన పాప్యులర్ నవల ‘ద బెస్ట్ సెల్లర్ షి రోట్’ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నారు. నవలా రచయితగా సూపర్ స్టార్ అయిన ఓ రచయితకు.. అతని యువ ప్రేయసికి మధ్య జరిగే ప్రేమకథగా ఇది రూపొందుతుంది.

ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తి రచయితగా నటిస్తుండగా.. అతని ప్రేయసిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కోసం ఈ వెబ్ సీరీస్ ను సిద్ధార్థ్ పి మల్హోత్రా నిర్మిస్తున్నారు. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. రెండు నెలల్లో చిత్రీకరణను పూర్తిచేస్తారు.