ఆరేళ్ల బాలుడి పాదయాత్ర..

మోదీ తాతయ్య, కేసీఆర్ తాతయ్య తనకు న్యాయం చేయండి అంటూ మెడలో ఫ్లకార్డు వేసుకుని కరీంనగర్ జిల్లా, శంకర్ పట్నానికి చెందిన బాలుడు పాదయాత్ర చేపట్టాడు. అయినవాళ్లే తమ భూమిని కబ్జా చేశారని, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటూ తాతయ్యతో కలిసి పోరాటం చేస్తున్న ఆ మనవడి కథ తెలిసి స్థానికులు చలించిపోతున్నారు.

బాధితుల కథనం ప్రకారం…. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమతలకు నాగప్రణీత్(6) అనే కుమారుడు ఉన్నాడు. 2017లో అనారోగ్య సమస్యలతో కుమారస్వామి-మమత చనిపోయారు. అప్పటినుంచి నాగప్రణీత్ తాతయ్య వద్ద పెరుగుతున్నాడు. కుమారస్వామి-మమత బతికున్నప్పుడు తమ ఎకరా భూమిని ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చారు.

మాజీ ప్రజాప్రతినిధి అయిన సదరు వ్యక్తి… ఆ ఇద్దరూ బతికున్నంత కాలం కౌలు చెల్లించాడు. అయితే ఆ దంపతులు చనిపోయాక… ఆస్తిని చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో భూమిని తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో కుమారస్వామి-మమతల ఒక్కగానొక్క కుమారుడు నాగప్రణీత్(6) తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తనకు దక్కేలా చేయాలని కోరుతూ.. మంగళవారం తన తాతతో కలిసి లింగంపల్లి గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాడు.