రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్స్‌ ప్రారంభం.. రోజుకు 24 మాత్రమే

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్లాట్‌ బుకింగ్స్‌ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా, పూర్తి పారదర్శకంగా, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం లేకుండా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరిగే విధానాన్ని శుక్రవారం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాత పద్ధతిలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ వెబ్‌సైట్‌ https://registration.telangana.gov.in ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు.

ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ బుకింగ్‌లను జరుపుకునేలా అనుమతి ఇచ్చామని, స్లాట్ బుక్ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్‌లు చేయరని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల తరువాత స్లాట్ బుకింగ్‌ల తాకిడి ఎక్కువయితే వాటిని 100 నుంచి 200ల వరకు పెంచుతామన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని హైకోర్టు సూచించిన విధంగానే చర్యలు చేపట్టామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే డాక్యుమెంట్‌లు అందచేస్తామన్నారు. డాక్యుమెంట్ రైటర్‌ల అవసరం లేకుండా డాక్యుమెంట్‌ను ప్రజలే తయారు చేసుకునేలా వెసులుబాటును కల్పించామన్నారు. ఈ చలాన్ సిస్టం అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం స్టాంప్ పేపర్ అవసరం లేదని సిఎస్ పేర్కొన్నారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు 100 మందితో వార్‌రూంను ఏర్పాటు చేశామని, 24*7 అందుబాటులో ఉంటుందన్నారు. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి టెక్నికల్, వేరే సమస్యలకు సంబంధించి కాల్‌సెంటర్ 18005994788లో సంప్రదించాలన్నారు.