తెలంగాణలో మందగించిన రుతుపవనాలు.. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రుతుపవనాల మందగమనం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన మొదట్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే, గత నాలుగు రోజులుగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతం అయి, గాలులు వీస్తున్నప్పటికీ వర్షపు చక్క జాడ మాత్రం లేదు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సెంటీమీటరు వర్షం  కూడా కురవలేదు.

అయితే శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో మాత్రం 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణంలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా మారింది. నల్గొండ జిల్లా పులిచర్లలో నిన్న పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 37.6, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, నేడు, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.