ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు పరిసర గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, ఎన్.డి.ఎ కూటమి నాయకులు, కొల్లేరు రైతులు ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రి సెల్వి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదేశాల మేరకు కలెక్టరేట్‌ను సందర్శించిన వారు, కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో ప్రభుత్వాలు మత్యకార మరియు కుల సంఘాలకు ఇచ్చిన సొసైటీ భూములు కాంటూరులో కలిసిపోయి, జీవనాధారాన్ని కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా, కొల్లేరు పరిసర గ్రామాల ప్రజలు ఆధారపడిన చెరువుల తొలగింపును నిలిపివేయాలని, వారి జీవనోపాధిని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని తెలిపారు. సొసైటీ భూముల విషయంలో బాధితులకు తగిన న్యాయం చేయాలని, వారి జీవనాధారాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు పరిసర గ్రామాల సర్పంచ్లు, రైతులు, మరియు ఎన్.డి.ఎ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment