తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోసం మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన సోనూసూద్‌!

క‌రోనా వేళ ప్ర‌జ‌ల‌కు తాను అండ‌గా ఉన్నానంటూ ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించిన సినీన‌టుడు సోనూసూద్ మ‌రో గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో మృత‌దేహాల సంర‌క్ష‌ణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజ‌ర్ బాక్సుల‌ను ఆయ‌న అందిస్తున్నారు. సంకిరెడ్డి ప‌ల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వ‌క‌ల్, మ‌ద్దికెర‌తో పాటు ప‌లు గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో ఫ్రీజ‌ర్ బాక్సులు లేక‌పోవ‌డంతో సాయం కోసం ఆయా గ్రామాల స‌ర్పంచులు ఇటీవ‌ల సోనూసూద్ సాయాన్ని కోరుతున్నారు. న‌గ‌రాల నుంచి ఫ్రీజ‌ర్ బాక్సులు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంద‌ని, అప్ప‌టికే శ‌వాలు కుళ్లిపోతున్నాయ‌ని వారు చెప్పారు. ఈ నేప‌థ్యంలో సోనూసూద్ ఈ కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. వీలైనంత త్వ‌ర‌గా ఫ్రీజ‌ర్ బాక్సులను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని సోనూసూద్ చెప్పారు.