రూ.20 లక్షల సాయం అందించిన సోనూనూద్
బాలీవుడ్ నటుడు సోనూసుద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య సహాయం కోసం ఆయన ముందుకొచ్చారు.
నిరుపేద కుటుంబానికి చెందిన హర్షవర్దన్ (6) అనే బాలుడికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం రూ. 20 లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన నాగరాజు-లక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్దన్ ఆరున్నర నెలల వయసు నుంచే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పటి నుండీ బాలుడికి చికిత్స చేయిస్తూ మందులు వాడుతున్నారు. ఇటీవల బాలుడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకవెళ్లారు. బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకు రూ.20 లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసే నాగరాజుకు అంత డబ్బు వెచ్చించే స్థోమత లేకపోవడంతో సాయం కోసం సోనూసూద్‌ను కలవాలని అనుకున్నారు. ఓ షూటింగ్ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు సోనూసూద్ వస్తున్నట్లు తెలుసుకున్న నాగరాజు దంపతులు, తమ కుమారుడిని వెంటబెట్టుకొని వెళ్లి కలిశారు. బాలుడి సమస్యను సోనుసూద్‌కు వివరించారు. స్పందించిన ఆయన, బాలుడిని వెంటనే ఆపోలో ఆస్పత్రిలో చేర్పించమని.. శస్త్రచికిత్సకు అవసరమైన రూ.20 లక్షలను తానే భరిస్తానని ప్రకటించారు. అదే రోజు సాయంత్రమే బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి లివర్ మార్పిడికి అవసరమగు పరీక్షలను జరిపించినట్లు తండ్రి నాగరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు తమ బిడ్డకు పునర్జన్మనిస్తున్న సోనుసూద్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.