దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ సేవలు

చిన్న, మధ్య తరహా వినియోగదారుల ప్రయోజనార్థం దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 5 నుంచి తొలి సర్వీసును ప్రారంభించనున్నారు. ముందుగా ఈ సర్వీసును హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వరకు పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కార్గో ఎక్స్‌ప్రెస్‌ను నడపనుంది. చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా.. నాన్‌ బల్క్‌ (తక్కువ పరిమాణం)లో సరుకులు చేర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు.. చిన్న పరిశ్రమదారులు తమ సరుకును కార్గో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం లభిస్తుంది. ఇక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా కూడా కార్గో బుకింగ్‌ చేసుకునేలా విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ వెల్లడించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

 కార్గో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు సరుకును బట్టి మారతాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రవాణా చార్జీలు టన్నుకు సగటున రూ. 2,500 వరకు ఉంటాయి. రోడ్డు రవాణా, ప్రస్తుత రైల్వే టారిఫ్‌తో పోలిస్తే 40 శాతం చార్జీలు తక్కువ.

ట్విట్టర్‌ ద్వారా బుకింగ్‌ నిమిత్తం విజయవాడ రైల్వే కమర్షియల్‌ విభాగం అధికారులు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. 

బుకింగ్‌ కోసం ట్విట్టర్‌ అకౌంట్‌ Vijayawada_RailFreight (@Bzarailfreight) ద్వారా రైల్వే అధికారులను పని దినాల్లో సంప్రదించాల్సి ఉంటుంది.

వినియోగదారులు సరుకు రవాణా రిజిస్ట్రేషన్, వ్యాగన్ల బుకింగ్‌ కోసం సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజరును, లేదా దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లోనూ సంప్రదించవచ్చు.