ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం హెల్త్‌బులిటెన్‌

చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశాయి. ”కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది” అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చిందంటూ వార్తలు రావడంతో ఎస్పీ చరణ్‌ స్పందింస్తూ.. అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్‌ టీం సంప్రదించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ హెల్త్‌ అప్‌డేట్‌లను మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ ఈ ఉదయం నుంచి ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. నాన్న ఆరోగ్యం గురించి మొట్టమొదటిగా సమాచారం పొందే ఏకైక వ్యక్తి నేనే.ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కొవిడ్‌ నెగిటివ్‌ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కరోనా నెగిటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే..ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది ఇలాగే ఉంటే, ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉంది. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత నేనే అప్‌డేట్‌ ఇస్తా” అని పేర్కొన్నారు.