సంక్రాంతికి స్పెషల్ బస్సులు: టీఎస్ఆర్టీసీ

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తం 4,980 బస్సులు నడపనుండగా అందులో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380, ఏపీకి 1,600 బస్సులు నడపనున్నట్టు రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.

8వ తేదీ నుంచి బస్సులు అందుబాటులోకి రానుండగా, అదే రోజు నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అయితే, నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఎంజీబీఎస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, జూబ్లీబస్ స్టేషన్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు.

ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు, ఖమ్మం, రాయచూర్, మహబూబ్‌నగర్, నాగ్‌పూర్, అమరావతి, నారాయణ‌ఖేడ్, శ్రీశైలం, కల్వకుర్తి, విజయవాడ, విశాఖపట్టణం, నాగర్‌కర్నూలు, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు, గుంటూరు, పెబ్బేరు, కొత్తకోట, మెదక్, బాన్సువాడ, బోధన్, బీదర్, తాండూరు, వికారాబాద్ వైపు బస్సులు బయలుదేరుతాయి.

జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లావైపు, సీబీఎస్ నుంచి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు వైపు, ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి యాదరిగి గుట్ట, వరంగల్ వైపు వెళ్లే బస్సులు, దిల్‌సుఖ్‌నగర్ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.