భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సీతారాములకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు శ్రీసీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకం జరగనుంది. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించారు. కొవిడ్ కారణంగా పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.

వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠరామునికి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను (స్వర్ణ మూర్తులను) రామదాసు చేయించిన దివ్యాభరణాలతో అందంగా అలంకరించి ఆలయ ప్రాం గణంలోని బేడా మండపం వద్దకు తోడ్కోని వచ్చారు. సీతారాములను అభిముఖంగా ఆశీనులను చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. కొందరు అర్చక స్వాములు రామయ్య తరఫున, మరికొందరు అర్చకులు సీతమ్మ తరఫున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు.

ఈ ఉత్సవంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌ దంపతులు, దేవస్థానం ఈఓ శివాజీ దంపతులు, ఏఈఓ శ్రావణ్‌కుమార్‌, ఈఓ సీసీ అనిల్‌కుమార్‌, డీఈ రవీందర్‌రాజు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, అర్చక, వైదిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.