శ్రీకాంత్‌ కొత్త వెబ్‌ సిరీస్

మారుతున్న కాలంతో పాటు తనను తాను మార్చుకుంటున్న నటుల్లో శ్రీకాంత్‌ ఒకరు. ఓ వైపు కథానాయకుడిగా చిత్రాలు చేస్తూ, మరోవైపు కీలక పాత్రల్లోనూ నటించారు. ఇప్పుడు నడుస్తోన్నకొత్త ట్రెండ్‌ అయిన వెబ్‌ సిరీస్ లకూ సై అంటున్నారు. ఇంతకు ముందు రాజకీయ నేపథ్యంలో రూపొందిన ‘చదరంగం’ లో ప్రధాన పాత్రలో ఆయన నటించారు. తాజాగా పోలీస్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’లో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఆనంద్‌ రంగా దర్శకత్వంలో చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ చిత్రీకరణలో శ్రీకాంత్‌ సెప్టెంబర్‌ నుంచి పాల్గొంటారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఎప్పుడూ హెల్దీ ఫిజిక్‌లో ఉండే ఆయన, ఈ సిరీస్‌ కోసం మరింత స్లిమ్‌ అవుతున్నారని తెలిసింది. సరికొత్త లుక్‌లో ఆయన కనిపించనున్నారట. ‘జీ 5’ ఓటీటీలో ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’ స్ట్రీమింగ్‌ కానుంది. ఇటీవల ఈ సిరీస్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు.