శ్రీవారి దర్శనం 45వేల మందికే పరిమితం

తిరుమల: కరోనా కేసుల పెరుగుదలతో టీటీడీ అప్రమత్తమైంది. బుధవారం నుంచి టైంస్లాట్‌ టోకెన్లు 15వేలు మాత్రమే జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అన్ని రకాల దర్శనాల్లో కేవలం 45వేల మందికే కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల వెళ్లే బస్సులు, క్యూలైన్లలో శానిటైజేషన్‌ చేయించనున్నట్లు అధికారులు చెప్పారు.

అలాగే తిరుమల వచ్చే ప్రతి భక్తుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అనీ, స్వామి వారిని దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించనున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే భక్తులు తిరుమలకు రావొద్దని కోరారు. కరోనా కేసులు తీవ్రమైతే శ్రీఘ్ర దర్శనం టికెట్లను రద్దు చేసి వాటిని మే, జూన్‌కు రీషెడ్యూల్ చేస్తామన్నారు. అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి అరగంట ముందు మాత్రమే అనుమతిస్తామని, భక్తులు గమనించాలని అధికారులు కోరారు.