సుస్థిర‌, స‌మ‌ర్ధ‌వంత‌మైన పాల‌న కూట‌మితోనే సాధ్యం: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్ సీపీ నాయ‌కులు ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారని, మ‌ద్యం, డ‌బ్బుల‌తో ఓట్ల‌ను కొనుగోలు చేయ‌డానికి సిద్ద‌మౌతున్నార‌ని జ‌న‌సేన సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్‌, ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ ఇప్ప‌టికే రాష్ట్రంలో వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ త‌మకు భ‌రోసా ఇచ్చే కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని తెలిపారు. దీంతో దింపుడు క‌ల్లం ఆశ‌తో ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు.
ప్ర‌శ్నిస్తే వేధింపులే:
ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేస్తున్నార‌ని, సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్‌ నిరంకుశత్వ బాధితులేన‌ని ఆరోపించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నవారు కూడా బహిరంగంగా మాట్లాడటానికి అమ్మో అంటున్నారంటే ఎంతగా భయపెట్టారో అర్థమవుతుందన్నారు. పోలీసులు సైతం పాలకపక్షానికి ప్రైవేటు సైన్యంగా మారి ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపడంతో అయిదేళ్ల జగన్‌ పాలన హిట్లర్‌నే మరిపించేలా సాగిందన్నారు.
రాష్ట్రంలో సుస్థిర‌,స‌మ‌ర్ధ‌వంత‌మైన పాల‌న కూట‌మితోనే సాధ్యం:
రాష్ట్రంలో సుస్థిర, సమర్ధవంతమైన పాలన రావాలి. ప్రజల కష్టాలను మనసుతో అర్ధం చేసుకునే పాలన, యువతకు ఉపాధి కల్పించే పాలన కూట‌మితోనే సాధ్య‌మ‌ని బాలాజి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పురోగమనం దిశగా సాగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల‌న్నారు. “వైసీపీ దోపిడీని అరికట్టి ఆ పార్టీని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ నెల 13వ తేదీ ఎన్నికల్లో యువతరం వారి కోపం, ఆక్రోశాన్ని అంతా ఓట్ల రూపంలో బలంగా చూపించాలన్నారు. అన్ని రంగాలను నాశనం చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్లబోతోందని. వచ్చేది కూటమి ప్రభుత్వమేనన్నారు. ఇందుకు ప్ర‌జ‌లు ఈ దిశ‌గా కూట‌మి అభ్య‌ర్ధుల‌ను గెలిపించాల‌ని కోరారు.