రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన జగన్

ఏపీ లో మరో కీలక పథకం ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . ఇక నుంచి ఇంటికే రేషన్ సరుకులు  అందనున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2 వేల 5 వందల రేషన్ డోర్ డెలివరీ వాహనాల్ని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ కోసం 9 వేల 260 వాహనాల్ని కేటాయించారు. ఈ వాహనాల్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీకు రంగం సిద్ధం చేశారు అధికారులు. నాణ్యమైన, మెరుగుపర్చిన బియ్యాన్ని ఇంటి వద్దే అందించేందుకు 830 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోజువారీ కూలీలకు రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల్ని దూరం చేసేందుకు వాలంటీర్ వ్యవస్థ సహాయంతో ప్రజల సమక్షంలో కచ్చితమైన తూకంతో వేలిముద్రల్ని తీసుకుని బియ్యం పంపిణీ చేయనున్నారు. వీటికోసం ప్రత్యేకమైన సంచుల్ని తయారు చేయించింది ప్రభుత్వం. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకు సీల్ ఉంటుంది. ప్రతి సంచికీ యూనిట్ కోడ్ ఉంటుంది. దీని ఆధారంగా ఆన్ లైన్ ట్రాకింగ్ వీలవుతుంది. ప్రతి మొబైల్ వాహనం నెలకు దాదాపు 18 రోజుల వరకూ రేషన్ సరుకుల్ని పంపిణీ చేస్తుంది.