తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

  • అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్లు నియోజకవర్గం:  గుంతకల్ పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కారం చూపాలని మరియు నియోజకవర్గంలోని వివిధ సమస్యల పైన కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమికి గుత్తి, గుంతకల్ జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వాసగిరి మణికంఠ మాట్లాడుతూ గత ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారం కొరకు గుత్తి మండలానికి 173 కోట్లు, పామిడి మండలానికి 63 కోట్లు కేటాయించిన అనంతరం ప్రభుత్వం మారడంతో తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ పనులను కక్ష సాధింపు చర్యలో భాగంగా మొదలు పెట్టకపోవడంతో ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఏర్పడింది. గుంతకల్ నియోజవర్గంలోని అనేక చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో బోర్ల ద్వారా నీటి సరఫరా బంద్ అయింది. ప్రధానంగా గుత్తి మున్సిపాలిటీలో ఉన్న స్పాట్ డెలివరీ ట్యాంకులు 50 శాతం నిరుపయోగంగా మారాయి. మున్సిపాలిటీ నిర్వహణలో గృహాలకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. సామాన్య నిరుపేదలు నెలకు వేలాది రూపాయలు నీటి కొరకు వెచ్చిస్తూ బాధపడుతున్నారు. మున్సిపాలిటీ వారు నెలకు లక్షలాది రూపాయలు నీటి కోసం వెచ్చిస్తున్న ప్రజలకు తాగునీరు, వినియోగం నీరు లేక ఇబ్బందికి గురవుతున్నారు పామిడి నుండి గుత్తి సత్యసాయి సంపు ద్వారా రోజుకు 10 లక్షల లీటర్లు నీరువ్ సరఫరా కావాల్సి ఉండగా పైప్ లైన్ మరమత్తులు సరిగా లేక 4 లక్షల లీటర్లు నీరు మాత్రమే సరఫరా కావడంతో 25 వార్డుల్లో తీవ్ర నీటి సమస్య నెలకొంది. దీంతో ఆవేదన చెందిన సామాన్యులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన వైసిపి ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ముఖ్యంగా గుత్తి మున్సిపాలిటీ వారు సత్య సాయి వాటర్ ప్రాజెక్టుకు 16.5 కోట్లు, వై టీ చెరువు ప్రాజెక్టుకు 1 కోటి రూపాయలు, విద్యుత్ శాఖకు దాదాపు 50 లక్షలు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇవి చెల్లించకపోవడం నిర్వహణ లోపం వల్ల సకాలంలో నీరు సరఫరా చేయడం లేదు. కావున భవిష్యత్తులో అయినా గుత్తి చెరువుకు హంద్రీనీవాజలాలు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి అవుతాయి. అంతేకాకుండా గుత్తి ప్రభుత్వాసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న బ్లడ్ బ్యాంకును కొనసాగిస్తూ ప్రారంభించాలి, గుత్తి మున్సిపాలిటీకి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, గుత్తి నుండి గుంతకల్ కు వెళ్లే మార్గంలో గుత్తి పట్టణంలోని శిథిలావస్థకు చేరుకున్న రైల్వే బ్రిడ్జి సైడ్ వాల్స్ ను, రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. గత ఎనిమిది నెలలుగా గుంతకల్ పట్టణంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న గుంతకల్ పట్టణంలోని స్థానిక ధర్మవరం గేటు సోఫియా కాలనీలో అమృత్ పైప్ లైన్ కొరకు తవ్విన గుంతను తక్షణం పూడ్చాలని ప్రధానంగా జనసేన పార్టీ తరఫున కలెక్టర్ కు డిమాండ్ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుత్తి, గుంతకల్ మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, బండి శేఖర్, కురుబ పురుషోత్తం సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, జనార్ధన్ యాదవ్ జిల్లా కార్యక్రమాల నిర్వాహన కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ జనసైనికులు కసాపురం వంశీ, రామకృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.