వారణాసి రైలును పార్వతీపురంలో ఆపండి: జనసేన వినతి

పార్వతీపురం, విశాఖ నుండి వారణాసికి నడిపే వేసవి ప్రత్యేక రైలు బండిని పార్వతీపురంలో ఆపాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. గురువారం ఆ పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరీస్, జిల్లా కన్జ్యూమర్స్ ఫారం పాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారణాసి శ్రీహరి తదితరులు పార్వతీపురం రైల్వే స్టేషన్ మాస్టర్ మజ్జి రామకృష్ణను కలిసి కొత్తగా విశాఖపట్నం నుండి వారణాసికి నడిపే సమ్మర్ స్పెషల్ వీక్లీ ట్రైన్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం నుండి వారణాసికి కొత్తగా వీక్లీ సమ్మర్ స్పెషల్ ట్రైన్ ను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమన్నారు. అయితే దీని స్టాపు పార్వతీపురంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఈ ట్రైను పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాబట్టి పార్వతీపురంలో ఈ ట్రైన్ ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే స్టేషన్ మాస్టర్ ద్వారా రైల్వే డివిజనల్ మేనేజర్ కు జనసేన పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ట్రైన్ షెడ్యూల్ సంబంధించి తమకున్న సమాచారం మేరకు విశాఖపట్నం, రాయగడ, రాయపూర్ తదితర స్టాపులు మాత్రమే వారణాసికి ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో స్టాపు లేదన్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు ఆవేదనకు గురవుతున్నారన్నారు. రైల్వే శాఖకు తగినంత ఆదాయాన్ని సమకూరుస్తున్న పార్వతీపురాన్ని విస్మరించడం సరికాదన్నారు. తక్షణమే విశాఖ వారణాసి సమ్మర్ స్పెషల్ ట్రైన్ పార్వతీపురంలో ఆగేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్ మాస్టర్ మజ్జి రామకృష్ణను కోరారు. ఈ విషయమై స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.