రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు.. ఏపీ డీజీపీ వార్నింగ్

ఏపీలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పట్టాభి ఇంటిపైనే కాకుండా కేంద్ర రాష్ట్ర టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడికి నిరసనగా బుధవారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవద్దని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు. సంయనం పాటించాలంటూ తెలిపింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దని, చట్టాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపింది. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయమనం పాటిస్తూ సహకరించాలని కోరింది.