‘స్వర్ణాంధ్ర’ దిశగా బలమైన అడుగులు!

* ఆశలు రేకెత్తిస్తున్న రాష్ట్ర బడ్జెట్‌
* సంక్షేమానికి పెద్దపీట
* అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు
* రూ.3.22 లక్షల కోట్ల పద్దు

దొంగలు పడిన ఇంటిని తిరిగి బాగు చేసుకోవలసిందే…
ఎంత నష్టం కలిగిందో తరచి చూసుకోవలసిందే…
కలిగిన కష్టాన్నిఅధిగమించి ముందుకు సాగవలసిందే…
తేరుకుని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయవలసిందే…
అదే ప్రయత్నం కనిపించింది రాష్ట్ర బడ్జెట్‌ స్థూల స్వరూపాన్ని విశ్లేషించి చూసినప్పుడు.
వైకాపా ప్రభుత్వ అరాచక విధానాల వల్ల అన్ని వ్యవస్థలూ కుదేలైపోయి భ్రష్టు పట్టిన వేళ…
ఎక్కడికక్కడ అప్పులు, అనవసర ఆర్భాట ఖర్చుల పర్యవసానాలు వెక్కిరిస్తున్న వేళ…
ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర శాసన సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌’ దిశగా బలంగా పడుతున్న అడుగుల సవ్వడిని వినిపించింది!
అభివృద్ధి బాటలో ప్రారంభించిన పునఃప్రయాణ సన్నాహాల సంరంభాన్ని కళ్లకుకట్టి ఆశలు రేకెత్తించింది!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌, భవిష్యత్తును భేషుగ్గా తీర్చిదిద్దుకునే ప్రయత్నానికి అద్దం పట్టింది!
ఏపీ శాసన సభలో విత్త మంత్రి వివరించిన వివరాల ప్రకారం బడ్జెట్‌ స్థూల విలువ రూ. 3.22 లక్షల కోట్లు!
రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు!
మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు!
రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు!
ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు!
అంకెలు చెప్పే అంచనాల వివరాల నుంచి బడ్జెట్‌ లక్ష్యాలేంటని విశ్లేషించి చూస్తే…
గత వైకాపా ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాల నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టే సంకల్పం ప్రస్షుటంగా ఆవిష్కారం అవుతోంది.
దేశానికే అన్నపూర్ణ అనే పేరును తెచ్చిపెట్టిన రాష్ట్రంలో వ్యవసాయానికి రూ. 48 వేల కోట్లు కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వ ప్రాథమ్యాలలో రైతన్నల సంక్షేమమే మొదటిదనే సంకేతాన్ని ఆర్థిక మంత్రి అందజేశారు. ఇదే కాకుండా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కోసం ప్రత్యేకంగా రూ. 6300 కోట్లు కేటాయించి కర్షకుల కళ్లలో ఆశల వెలుగులు నింపారు. రాష్ట్రానికే జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ. 6705 కోట్లు, భవిష్యత్తులో అంతకు పదిరెట్ల ఆదాయాన్ని అందించే అవకాశాలకు పునాదే.
”రాష్ట్ర రుణ సామర్థం సున్నాకు చేరుకుంది… అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది…’ అంటూ బడ్జెట్‌ సమావేశంలో ఉటంకించిన శ్రీ పయ్యావుల పలుకులు, వైకాపా అస్తవ్యస్త పాలన పర్యవసానాన్ని ఎత్తి చూపించిన కఠోర సత్యాలే.
అలాంటి పరిస్థితుల్లో రూపొందించిన బడ్జెట్, రాబోయే కాలంలో రూపుదిద్దుకోనున్న ఉజ్వల భవిష్యత్తుకు తొలి సంకేతాలను అందించి ఆశల ఊపిరులూదింది.
వైకాపా ఆధ్వర్యంలో మూడు రాజధానులంటూ ప్రచారం చేసి, అసలు రాజధానే లేకుండా చేసిన నిర్వాకాన్ని సరిదిద్దుతూ ఆర్థిక మంత్రి ‘అమరావతి అభివృద్ధి’కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
”తెలంగాణాకు హైదారాబాద్‌, మహారాష్ట్రకు ముంబై ఎంత ముఖ్యమో, అందుకు దీటుగా ఏపీకి అమరావతి కూడా అంతే ముఖ్యం. ఆయా నగరాలకు దీటుగా మన రాజధానిని తీర్చిదిద్దుతాం” అంటూ ఘన సంకల్పాన్ని ఎలుగెత్తి చాటారు.
* కేటాయింపుల్లో కీలక పద్దులు…
– వైకాపా హయాంలో కునారిల్లిపోయిన విద్యారంగం వికసించేలా పాఠశాల విద్యా శాఖకు రూ. 31,805 కోట్టు!
– అణగారిన దశలో ఆశలుడి ఉన్న నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ శాఖకు రూ. 1228 కోట్లు!
– ఉన్నత విద్యా రంగం ఊపిరి తీసుకునేలా రూ. 2506 కోట్లు!
– ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు!
– ఎస్టీల సంక్షేమానికి రూ. 8,159 కోట్లు!
– బీసీల సంక్షేమానికి రూ. 47,456 కోట్లు!
– అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ. 5,434 కోట్లు!
– మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 4,332 కోట్లు!
– వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి రూ. 19,264 కోట్లు!
– పంచాయితీ రాజ్‌ శాఖకు రూ. 18,847 కోట్లు!
– పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 13,862 కోట్లు!
– గృహనిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు!
– జలవనరుల శాఖకు రూ. 18,019 కోట్లు!
– పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ. 3,156 కోట్లు!
– ఇంధన శాఖకు రూ. 13,600 కోట్లు!
– ఆర్‌ అండ్‌ బీకి రూ. 8785 కోట్లు!
– యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ. 469 కోట్లు!
– జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం రూ. 2800 కోట్లు!
– వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు!
– పౌర సరఫరాల శాఖకు రూ. 3,806 కోట్లు!
– తల్లికి వందనం కోసం రూ. 9407 కోట్లు!
– ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ. 27,518 కోట్లు!
– దీపం పథకానికి రూ. 2,601 కోట్లు!
– మత్స్యకార భరోసాకి రూ. 450 కోట్లు!

Share this content:

Post Comment