ప్రజా సమస్యలపై పోరుబాట.. జనంలోకి జనసేనాని!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేలా కార్యక్రక్రమాలను చేపట్టనున్నామని జనసేన నేతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఏపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీలో రహదారుల పరిస్థితి గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళ్లామని గుర్తుచేశారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా స్పందించలేదని.. అయితే జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంతో ప్రభుత్వం స్పందించిన తీరు అందరూ చూశారని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేశారు.

ఇక తాను చేపట్టనున్న జిల్లాల పర్యటనలో సామాన్య ప్రజల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా జనసేన కార్యక్రమాలు ఉండాలని జనసేన నాయకులకు సూచించారు. శ్రమదానం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. శ్రమ దాన స్ఫూర్తిని కొనసాగిస్తూ.. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫించన్లు ఆపేయడం, రేషన్‌ కార్డుల కోత, అమ్మఒడి వాయిదా వంటి అంశాలతో పాటు జిల్లాల వారీగా ఉన్న సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలని నిర్ణయించారు. ఇక నవంబరు 15 నాటికిపార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో పార్టీ క్రియాశీలక సభ్యులకు శిక్షణ తరగతులను నిర్వహించడానికి పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.