ఆంధ్ర కేసరి యూనివర్శిటీ: నేటి కాలంలో విద్యార్థినీ విద్యార్థులకు చదువు తోబాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి అన్నారు. శనివారం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఏ.కే.యూ అంతర కళాశాలల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ పోటీల నిర్వహణ అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తుది జట్టును ఆయన హృదయ పూర్వకంగా అభినందించారు. సమిష్టి కృషితో రాణించి, ఆటలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని వి.సి.ప్రొఫెసర్ మూర్తి ఆకాంక్షించారు. అంతకు ముందు ఏ.కే.యూ క్రీడా మైదానంలో ప్రారంభమైన హ్యాండ్ బాల్ టోర్నమెంట్ పోటీలను ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ. దేవీ వర ప్రసాద్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరిబాబుకు డాక్టర్ దేవీ వర ప్రసాద్, ఏ.కే.యూ హ్యాండ్ బాల్ జట్టు సెలెక్షన్ కమిటీ మెంబర్ గంటా. సాయి సురేష్ తదితరులు క్రీడాకారులను పరిచయం చేసారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల యందు కూడా ఆసక్తిని కనపరచాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులకు విద్య, ఉద్యోగ రంగాలలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏ.కే.యూ.ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరి లోనూ మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఉన్నత స్థాయి చదువుల కోసం కృషి చేస్తున్న విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా కింద అడ్మిషన్లు లభిస్తాయని అన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యం విషయంలో ఎంతగానో ఉపయోగ పడతాయని, దేహ దారుఢ్యం కూడా పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల పి.డి. కే.ఆర్.కరుణ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడపాల.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని పెరియార్ యూనివర్శిటీ, సేలం నందు జరిగే దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ పోటీలలో పాల్గొంటారని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీ వర ప్రసాద్ తెలిపారు.

Share this content:
Post Comment