రాజోలులో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్‌ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. తన స్వస్థలమైన తూర్పు గోదావరి జిల్లా, మట్టపర్రు దగ్గర రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డీఓసీఎస్‌ 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు.

రాజోలులో ప్లాంట్‌ నిర్మాణం తక్షణమే చేపట్టి నాలుగురోజుల్లో పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రూ.25లక్షలతో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్న సుకుమార్‌ ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తే అవసరానికి తగిన ఆక్సిజన్‌ తయారుచేసుకోవచ్చన్న ఉద్దేశంతో మరో రూ.15 లక్షలు జత చేసి మొత్తం రూ.40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారని సుకమార్‌ స్నేహితుడు అమలాపురం పంచాయతీరాజ్ డీఈఈ అన్యం రాంబాబు తెలిపారు. సుకుమార్‌ సేవాగుణాన్ని టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు కోనసీమ ప్రజలు కూడా అభినందిస్తున్నారు.