మళ్లీ పెళ్లి.. వార్తలపై స్పందించిన సుమంత్

హీరో సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త చర్చనీయాంశంగా మారింది. అనేక మీడియా వేదికలపై సుమంత్ రెండో పెళ్లిపై కథనాలు వచ్చాయి. పవిత్ర అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని, ఇద్దరూ కలిసి పెళ్లి కార్డులు కూడా పంచుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని సుమంత్ ఖండించారు. తాను మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

తాను నటిస్తున్న కొత్తం చిత్రం పెళ్లి, విడాకులకు సంబంధించిన కథతో తెరకెక్కుతోందని, ఆ చిత్రం సెట్స్ నుంచి ఓ పెళ్లి కార్డు లీకైందని, దాన్నే అందరూ తన పెళ్లి కార్డు అనుకుంటున్నారని సుమంత్ వివరణ ఇచ్చారు. త్వరలోనే ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతాయని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కాగా, సుమంత్ కు గతంలో నటి కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.