★ డాక్టర్ కందుల ఆధ్వర్యంలో సంబరాలు
★ మహిళలకు మిఠాయిల పంపిణీ
తొమ్మిది నెలల ఊహించని ప్రయాణం సునీత విలియమ్స్ జీవితంలో మరో కొత్త అధ్యాయంగా నిలిచిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. భూమిని దాటి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన ఈ మహిళ అంతరిక్షం నుంచి సురక్షితంగా తిరిగి భూమికి చేరుకోవడం సంతోషకరమని, సునీత విలియమ్స్ కేవలం ఒక అంతరిక్ష యాత్రికురాలే కాకుండా సాహసవంతురాలు, నిరంతర సంచారి, స్ఫూర్తిదాయక స్టార్ అని కొనియాడారు. 10 రోజులు మాత్రమే అనుకున్న ఈ యాత్ర 9 నెలలు సాగినట్లు ఆయన తెలిపారు. మార్చి 19న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమెతో పాటు మరికొందరు వ్యోమగాములు భూమికి చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లిపురం నేరెళ్ల కోనేరులోని తన కార్యాలయంలో మహిళలతో సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచారని తెలిపారు. 17 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని, మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె భద్రతకై ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. సునీత తనతోపాటు వినాయక ప్రతిమను, భగవద్గీతను తీసుకువెళ్లారని, భారతీయ మూలాలను ఎప్పటికీ మరచిపోనని ఆమె ప్రదర్శించినందుకు ప్రశంసలు తెలిపారు. 1965 సెప్టెంబర్ 19న జన్మించిన సునీత, ఈ ఏడాది సెప్టెంబరుకు 60 ఏళ్లకు చేరుకుంటారని, ఆమె అమెరికన్ వ్యోమగామి మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ నేవీ అధికారి అని, తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందిన భారతీయ అమెరికన్ న్యూరో అనాటమిస్ట్ అని వివరించారు. ఏదేమైనా సునీత విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి రావడం సంతోషకరమని అన్నారు.
Share this content:
Post Comment