ఏపీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు: స్టేటస్ కో ఎత్తేసేందుకు నో, పిటిషన్ కొట్టివేత

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తలిగింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కోపై స్టే తొలగించాలంటూ.. వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున నిర్ణయం తీసుకోలేమని.. హైకోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఎపీ హైకోర్టులో ఈ నెల 27వ తేదీన కేసు విచారణ జరగనుంది. అప్పటి వరకూ హైకోర్టు స్టేటస్ కో విధించింది.

గవర్నర్‌ కూడా ఆమోదముద్ర వేసిన మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై హైకోర్టు స్టే ఇవ్వలేదు. ప్రభుత్వ వాదన వినిపించడానికి.. సమయం ఇస్తూ.. అప్పటి వరకూ స్టేటస్ కో మాత్రమే ఇచ్చింది. అయితే.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాదనలు వినిపించకుండా.. హడావుడిగా సుప్రీంకోర్టుకు వెళ్లడంపై విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. శరవేగంగా విచారణకు తీసుకు రావాలని ఏపీ సర్కార్ ప్రయత్నం చేసింది. అయితే ఓ సారి పిటిషన్‌లో తప్పుల వల్ల .. మరో రెండు సార్లు ధర్మాసనాలు మార్చడం వల్ల.. వాయిదా పడింది.

వాస్తవానికి ఈ కేసు ఈ నెల 28వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. అయితే 27వ తేదీన కేసు విచారణ ఎపీ హైకోర్టులో ఉంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేసు ను సుప్రీంకోర్టులో ముందుగానే విచారణ చేపట్టాలని మెన్షన్ చేయడంతో బుధవారమే విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. న్యాయనిపుణులు కూడా ఇలాంటి తీర్పే వస్తుందని ముందు నుంచి చెబుతున్నారు. దిగువ కోర్టులో ఉన్నప్పుడు.. ఏదైనా తీర్పు వచ్చిన తర్వాతనే ఎగువ కోర్టుకు వస్తూంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం. ప్రతీ చిన్న విషయానికి సుప్రీంకోర్టు వద్దకు వెళ్తోంది.