‘ఉప్పెన’ ట్రైలర్‌ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. గతేడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ”ప్రేమంటే.. ఓ లైలా మజ్నులా.. దేవదాసు పార్వతిలా” అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ పక్కా కమర్షియల్ అంశాలతో.. విజయ్ సేతుపతి నటనా విశ్వరూపంతో అదిరిపోయిందని చెప్పాలి. అటు హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ కూడా బాగుంది’ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు చక్కగా కుదిరింది. కాగా, మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.