వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై అనుమానాలు ఉన్నాయి

• వరుస మరణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం
• అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపడానికి గతంలో ప్రయత్నించారు
• లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటాం
• క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి జగన్
• ఆయన్ను వ్యతిరేకించారని తల్లి, చెల్లినే వేధించారు
• పండగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహిస్తాం
• కాకినాడలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. డ్రైవర్ ఆదినారాయణ, భారతి గారి తండ్రి ఈ.సి.గంగిరెడ్డి మరణాల నుంచి తాజాగా వాచ్ మెన్ రంగన్న మరణం వరకు జరిగిన ఆరు మరణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. ఒక హత్యను కప్పిపుచ్చడానికి జరుగుతున్న వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని, 2019 నుంచి జరిగిన వరుస మరణాలపై ఆరా తీస్తామన్నారు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ పర్యవేక్షణ కోసం కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను శనివారం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “మాజీ మంత్రి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు, మూడేళ్లలో ఆరుగురు చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకాను హత్య చేసి రాజకీయంగా వాడుకోవడానికి, ఆ నిందను శ్రీ చంద్రబాబు గారిపై మోపారు. హత్య కేసును విచారించడానికి వచ్చిన సీబీఐ అధికారులపై దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేశారు. అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపడానికి ప్రయత్నించారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తారో వివేకానందరెడ్డి హత్యే ఒక ఉదాహరణ. ఒక హత్యను కప్పిపుచ్చడానికి ఆరు అనుమానాస్పద మరణాలు సంభవించాయి. ఈ ఆరుగురు సాక్షుల మరణాల వెనుక ఉన్న కారణాలను త్వరలోనే ప్రజల ముందు పెట్టి లా అండ్ ఆర్డర్ పై అందరికీ నమ్మకం కలిగేలా చేస్తాం.
• హత్యల్లో పోటీ పడలేం
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తల్లిగా… సోదరిగా… భార్యగా… కుటుంబంలో ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తున్న మహిళామూర్తులను గౌరవించుకునే రోజు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన తల్లి, చెల్లిని ఆస్తుల కోసం ఎలా వేధిస్తున్నారో మనకు తెలుసు. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలని తిరిగిన డాక్టర్ సునీత గారిపై ఎంత దాష్టీకానికి ఒడిగట్టారో మనం చూశాం. ఎవరూ ఆయన్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే కుటుంబ సభ్యులనైనా వదిలిపెట్టరు. ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు. వాళ్లతో మనం అభివృద్ధిలో పోటీ పడగలం… సంక్షేమంలో పోటీపడగలం తప్ప హత్యల్లో పోటీ పడలేము.
• ఎన్నో అడ్డంకులు సృష్టించారు
వైసీపీ అధికారంలో ఉనప్పుడు జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే అనేక అడ్డంకులు సృష్టించేవారు. స్థలం ఇచ్చే రైతులను బెదిరించేవారు. సభకు హాజరుకాకుండా నాయకులను హౌస్ అరెస్టులు చేసేవారు. ఇప్పటంలో 22ఏ పేరుతో భూములు తీసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలని విశాఖలో జనవాణి నిర్వహించడానికి వెళ్తే మూడు రోజులు హోటల్లో నిర్భందించారు. ఇప్పుడు ఆవిర్భావ సభపై తన సొంత ప్రచార మాధ్యమాల్లో బురదజల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలను మనందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలకు ఆవిర్భావ దినోత్సవం ఒక పండగ రోజు. ముఖ్యంగా స్వార్థం లేని నాయకుడిని గెలిపించుకున్న పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నాం. సభ పర్యవేక్షణ కోసం కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఒక మీడియా సెంటర్ లా పనిచేస్తుంది. ప్రతి రోజు చేసే కార్యక్రమాలను ఇక్కడ నుంచి మీడియాకు వివరిస్తాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలివస్తారు. వారందరికీ ఎలాంటి ఇక్కట్లు కలగకుండా సభ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరగబోయే తొలి ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత మనందరిపై ఉంది. సభ నిర్వహణకు ఇప్పటికే 14 కమిటీలు నియమించి దిశానిర్దేశం చేశామ’ని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీ గారు, శ్రీమతి లోకం మాధవి గారు, అరవ శ్రీధర్, నిమ్మక జయకృష్ణ, బత్తుల బలరామకృష్ణ, పత్సమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కుడా ఛైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
• సభాస్థలి పరిశీలన
అంతకుముందు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోవత్సవం ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ పరిశీలించారు. ప్రధాన వేదిక, డీజోన్, వీరమహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలని నాయకులకు సూచించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ కి పలు సూచనలు చేశారు.
• వీర మహిళలకు చిరు సత్కారం
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కాకినాడలో పర్యటిస్తున్న మనోహర్, పి. హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన వీర మహిళలను సత్కరించారు. వారికి శాలువాలు కప్పి గౌరవించారు.

Share this content:

Post Comment