ఆహార భద్రతకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలి: తమిళిసై

రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాస్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌ఎస్‌ పరోడాకు డాక్టర్‌ స్వామినాథన్‌ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… పర్యావరణం దెబ్బతినడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, మనమంతా ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవని పేర్కొన్నారు. హరిత విప్లవంతో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయడంలో డాక్టర్‌ స్వామినాథన్‌ కీలక భూమిక పోషించారని కొనియాడారు.

దేశానికి సుస్థిరమైన ఆహార భద్రత అత్యవసరమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నిరంతరం ఆహార భద్రత కోసం, ప్రజల ఆకలిని తీర్చడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని ఆమె సూచించారు.