రాజమహేంద్రవరం రీజనల్ సైన్స్ సెంటర్ కి ‘స్వామి జ్ఞానానంద’ పేరు ప్రతిపాదన

* కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం విభాగం, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా రాజమహేంద్రవరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రీజనల్ సైన్స్ సెంటర్ కు ‘స్వామి జ్ఞానానంద’ పేరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి.అనంతరాము లేఖ రాశారు. రాజమహేంద్రవరంలో రూ.15.20 కోట్లతో ఈ సెంటరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. క్యాపిటల్ ఫండ్ రూ.11.7 కోట్లలో 50 : 50 రేషియోలో, కార్పస్ ఫండ్ రూ.3.5 కోట్లలో 80 : 20 శాతం రేషియోలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను అందించి సైన్స్ సెంటరు నిర్మాణాన్ని పూర్తి చేశాయి. 2023-24 సంవత్సరాలలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సెంటరును వివిధ కారణాల రీత్యా ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఈ సెంటరుకు ‘‘స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటరు’’గా రాష్ట్ర ప్రభుత్వం పేరును ప్రతిపాదించింది. స్వామి జ్ఞానానంద న్యూక్లియర్ సైన్స్ బోధనలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంధ్రా యూనివర్శిటీలోని న్యూక్లియర్ సైన్సు విభాగానికి ప్రత్యేకతను తీసుకురావడంలో ఆయన విశేష ప్రతిభ దాగుంది. 1956 నుంచి 1965 వరకు యూనివర్శిటీలో న్యూక్లియర్ సైన్స్ బోధనలో తన ముద్ర వేశారు. ఎందరో విద్యార్థులకు జ్ఞానం పంచి గొప్ప శాస్త్రవేత్తలుగా, నిపుణులుగా తయారు చేయడంలో ఆయన తన పేరును సుస్థిరం చేసుకున్నారు. అప్పటి న్యూక్లియర్ సైన్స్ విద్యార్థులు నేటికీ స్వామి జ్ఞానానంద బోధన పద్ధతులను, ఆయన సైన్స్ ను విశదీకరించే స్థాయిని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంతటి గొప్ప మహనీయుడి పేరును రాజమహేంద్రవరం రీజనల్ సైన్స్ సెంటరుకు నిర్ణయిస్తే సముచితంగా ఉంటుందని, ఆయన సేవలను నేటి తరానికి గుర్తుకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పేరును ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి ఆమోదం రాగానే సెంటరుకు పేరును ఖరారు చేస్తారు.

Share this content:

Post Comment