T-SAT @10లక్షల డౌన్‌లోడ్‌లు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణా రాష్ర్టంలో ఆగస్టు 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం టీశాట్ ఛానెల్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. దీంతో టీశాట్ యాప్ డౌన్‌లోడ్‌లు 10 లక్షలకు చేరాయి. ఈ సందర్భంగా టీశాట్ సీఈవో శైలేష్ రెడ్డితో పాటు వారి సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. టీశాట్ యాప్ డౌన్‌లోడ్‌లు 10 లక్షలకు చేరిన సందర్భంగా శైలేష్ రెడ్డి ట్వీట్ చేయగా, దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు. విద్యార్థుల్లోకి టెక్నాలజీని చేరవేయడంలో ఇది ఒక ముందడుగు అని శైలేష్ రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో విద్యార్థులు తమ చదువును అభ్యసించేందుకు టీ శాట్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.