తాడేపల్లి బహిరంగ సభను జయప్రదం చేయాలి: అతికారి దినేష్

రాజంపేట, తాడేపల్లిగూడెంలో జరగనున్న జనసేన-టిడిపి ఉమ్మడి బహిరంగ సభను జయప్రదం చేయాలని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పిలుపునిచ్చారు. మంగళవారం యల్లమ్మ ఆలయం వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న టిడిపి-జనసేన బహిరంగ సభ అత్యంత ఆవశ్యకతను సంతరించుకున్నదని తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు. నాదెండ్ల మనోహర్ పాల్గొననున్న ఈ సభ వైసీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తోందని అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో పేద, మధ్యతరగతి, బడుగు-బలహీన వర్గాల జీవన ప్రమాణం అట్టడుగు స్థాయికి చేరుకుందని విమర్శించారు. శాండ్, మైన్, వైన్, భూ కబ్జాలకు పాల్పడుతూ వైసీపీ శ్రేణులు ఆరాచకాలకు పాల్పడ్డారని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ అక్రమ కేసులు బనాయిస్తూ వైసీపీ నియంత పాలన కొనసాగిస్తోందని, ప్రభుత్వం చేతగానితనం వలన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయిందని తెలిపారు. యువత ఉద్యోగ, ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వలసలు పోతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని, వారికి కేటాయించిన కార్పొరేషన్లు నామమాత్రంగా ఉంటూ సబ్ ప్లాన్ నిధులు దారిమల్లించి నవరత్నాల పథకాలకు కేటాయించారని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోక హత్యలు, దోపిడీలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో నడవాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అహంకార పూరిత వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపి వేసి రానున్న ఎన్నికలలో టిడిపి-జనసేన కూటమికి పట్టం కట్టి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయి, చేయి కలపాలని పిలుపునిచ్చారు. తాడేపల్లి బహిరంగ సభకు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.