చికిత్స కోసం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నా: సంజయ్ దత్

సంజయ్ దత్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆగస్టు 8న కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఐతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం అనేది కొవిడ్-19 లక్షణాలలో ఒకటి కావడంతో ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆయనకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సంజయ్‌కి నెగటివ్ ఫలితం తేలడంతో కుటుంబసభ్యులు, అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం అసలు ఆరోగ్య సమస్య ఎక్కడుందా అని మరిన్ని పరీక్షలు జరిపిన వైద్యులకు విషయం తెలిసిందని.. ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని అది ప్రస్తుతం 3వ దశలో ఉందని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే దీనిపై సంజయ్ దత్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి రెండు రోజుల చికిత్స అనంతరం సంజయ్ దత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మరుసటి రోజు ఆయన ఓ ట్వీట్ చేశారు.

తాను ఓ చికిత్స కోసం ప్రస్తుతానికి షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు సంజయ్ దత్ ఆగస్టు 11న ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఐతే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయొద్దని ఆ ట్విటర్ పోస్టులో సంజయ్ దత్ విజ్ఞప్తి చేశారు. సరిగ్గా సంజయ్ చేసిన ఈ ప్రకటనే ఆయనకు క్యాన్సర్ సోకిందని.. ఆ చికిత్స కోసమే బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్తున్నారనే అనుమానాలకు తావిచ్చింది. వాస్తవానికి ఆయన క్యాన్సర్ అనే పేరే ఎత్తలేదు. కానీ ప్రస్తుతం ముంబై మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆయన క్యాన్సర్ చికిత్స కోసం ఇవాళే అత్యవసరంగా అమెరికాకు వెళ్తున్నట్టు ముంబై మీడియా చెబుతోంది