అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెడదామనడం అవమానించడమే

  • రాజ్యాంగ సృష్టికర్తను గౌరవించక పోయినా సరే అవమానించకండి
  • ఎన్నికల ముందు దళితులను ముద్దులు పెట్టుకుని ఇప్పుడిలా మాట్లాడడం బాధాకరం
  • జూపూడి ప్రభాకర్ మాటలను జగన్, వైసీపీలోని నేతలు ఎందుకు ఖండించరు
  • విదేశీ విద్యా దీవెన కు జగన్ పేరు, రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే బాగుండు మాకు డబ్బులే ముఖ్యం అన్న జూపూడి ప్రభాకర్ మాటలను తీవ్రంగా ఖండించిన జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్

తిరుపతి, వైసీపీలోని నేతలు దళితులపై కపట ప్రేమను చూపిస్తున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారని, జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తామని, ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, దళితులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని కిరణ్ రాయల్ ఆదివారం మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పెద్ద ఎత్తున జనసేన నిరసన చేపడుతామన్నారు. అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు జగన్ ను పూజిస్తున్నారన్న మాటలను ఖండిస్తూ ఏ విధంగా రైతులు జగన్మోహన్ రెడ్డిని పూజించారో చెప్పాలన్నారు. మీకు మీరే భజన చేసుకుంటూ రాష్ట్రంలో దళితులు, రైతులు మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుంటున్నారని, వైసీపీ నేతలు అనుకోవడం హాస్యాస్పదమన్నారు. వైసీపీలోని దళిత నేతలు జూపూడి ప్రభాకర్ మాటలను ఖండించాలని, లేని పక్షాన రేపు వారు దేనికైనా సిద్ధమవుతారన్నారు. జనసేన దళిత నాయకుడు, పార్ధు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై జరుగుతున్న దాడులను, దళితులకు ఇస్తున్న పథకాలను ఆపేసారని, దళితులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడమే తప్ప, ఏ ఒక్క దళిత నాయకుడికి ఆ పార్టీలో గుర్తింపు లేదని, జూపూడి ప్రభాకర్ మాటలు దళితులను బాధపెట్టే విధంగా ఉన్నాయని, అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని, దీనిపై దళితులందరూ నోరు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, వంశీ, నవీన్, కిషోర్ హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.