Team India క్లీన్ స్వీప్ చేస్తుంది: గవాస్కర్
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 18 నుంచి 22 వరకూ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టెస్ట్ సిరీస్‌కి 45 రోజులు గ్యాప్ ఉండటంతో టీమిండియా మెరుగ్గా సిద్ధమవుతుందని గవాస్కర్ అంచనా వేశాడు.
`న్యూజిలాండ్‌తో ఫైనల్ తరువాత ఆరు వారాలకు ఇంగ్లండ్ సిరీస్ మొదలుకానుంది. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓడినా ఆ ప్రభావం టెస్ట్ సిరీస్‌పై పెద్దగా ఉండదు. టెస్ట్ సిరీస్‌లో టీమిండియానే కచ్చితంగా విజేతగా నిలుస్తుంది. 4-0తో సిరీస్‌ను స్వీప్ చేస్తుంది. ఇంగ్లండ్ పిచ్‌లపై పచ్చికను ఉంచినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. అలా ఉంచినా అది కోహ్లీ సేనకు పెద్ద సమస్యేమీ కాదని నా అభిప్రాయం. అలాంటి పిచ్‌లపై రాణించగల పేసర్లు టీమిండియాలో ఉన్నారు. భారత బౌలర్లు కచ్చితంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతార`ని అన్నాడు.