నాలుగో టెస్ట్‌లో టీమిండియా విక్టరీ

అహ్మదాబాద్ : మొతెరాలో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఇంగ్లండ్‌ను దారుణంగా చిత్తు చేసింది. నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం నమోదు చేసింది. సిరీస్‌ను 3-1 తేడాతో నెగ్గిన భారత్‌.. జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. నాలుగవ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు అశ్విన్, అక్షర్‌లు ఇరగదీశారు. ఇద్దరూ చెరో అయిదు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 135 రన్స్‌కే ఆలౌటైంది. అంతకముందు ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 365 రన్స్ చేసింది. ఇండియన్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచరీ చేయగా.. వాషింగ్టన్ సుందర్ 96 చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వరుసగా వికెట్లు..

అయితే ఇవాళ తొలి సెషన్‌లోనే రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఎక్కడా అచ్చిరాలేదు. సెకండ్ సెషన్ ఆరంభంలోనే భారత స్పిన్నర్లు దూకుడు ప్రదర్శించారు. ఇంగ్లండ్‌ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎటువంటి మెరుపులు మెరిపించకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. కెప్టెన్ జో రూట్ కాసేపు భారత స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. జో రూట్ 30 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో డాన్ లారెన్స్ కాస్త ప్రతిఘటించాడు. లారెన్స్ హాఫ్ సెంచరీ చేసి చివరకు అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అశ్విన్‌, అక్షర్‌లు వరుసగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా పిచ్‌లో నిలదొక్కుకునేలా చేయలేదు.

అయిదేసిన అక్షర్‌..

అక్షర్ పటేల్ మళ్లీ ఇరగదీశాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఖంగుతినిపించాడు. వరుసగా మూడోసారి అయిదు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్‌కు అనుకూలమైన మొతెరా పిచ్‌పై అక్షర్ అదరగొట్టాడు. స్పిన్‌తో పాటు బౌన్స్ కూడా వేసిన అక్షర్ ధాటికి ఇంగ్లండ్ విలవిలలాడింది. మూడవ టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్‌.. మొత్తం నాలుగోసారి తన ఖాతాలో 5 వికెట్లు వేసుకున్నాడు. కొత్త స్టేడియం మొతెరాలో జరిగిన మూడవ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఇక నాలుగవ టెస్టు కూడా కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. పిచ్ తీరుపై ఇంగ్లండ్ ప్లేయర్లు అసహనం వ్యక్తం చేసినా.. భారత స్పిన్నర్లు మాత్రం తమ సత్తాను చూపించారు.

స్కోరు బోర్డు

ఇంగ్లండ్ 205, 135

ఇండియా 365