పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమల్లో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈరోజు సెలవులపై ఆమె ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అన్ని విషయాలపైనా చర్చించారని చెప్పారు. ఆ తర్వాతే సెలవులపై నిర్ణయం తీసుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీ పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్టు ఆమె చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీనే చివరి పనిదినమన్నారు. కాగా, ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని ఆమె గుర్తు చేశారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53.79 లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు.