సినీ పరిశ్రమకు అండగా తెలంగాణ సర్కార్: మంత్రి తలసాని

చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైందని, వారిని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సినీ కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందేలా చూడాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేసిందని అందరూ సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు సినీ పరిశ్రమ అధ్యక్షుడు అనిల్ కుమార్, పీఎస్‌ఎన్‌, దొర, చిత్రపురి కాలనీ సెక్రెటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.