తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఉత్తర్వులు జారీ..

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ తరహాలోనే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35 లక్షల మంది పదో తరగతి విద్యార్ధులు ఉండగా.. వీరందరినీ కూడా గ్రేడింగ్ ఆధారం పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ సీఎం కేసీఆర్‌కు పంపగా.. ఆ ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ప్రకటించారు. ఎస్‌ఎస్‌ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్‌ విధానం ద్వారా ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని వెల్లడించింది.