ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలుపు ఓ అద్భుతం: పవన్ కల్యాణ్

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డ మీదే టెస్టు సిరీస్ సాధించడం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బ్రిస్బేన్ మైదానంలో జరిగిన టెస్టులో భారత్ గెలిచిన తీరు ఓ అద్భుతం అని అభివర్ణించారు. ఈ ఘనత సాధించిన భారత జట్టుకు తన తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా, అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, కలసికట్టుగా గెలుపుకోసం పోరాడిన తీరు ప్రశంసనీయం అని తెలిపారు.