తేజ్‌ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి తేజ్‌ 35 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇప్పటికే ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ప్రకటించగా తాజాగా పవన్‌ కల్యాణ ఓ ప్రకటన చేశారు.

ఈ మేరకు పవన్‌ ‘అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడ్డారు’ అని అన్నాడు.

అలాగే ‘తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో ప్రార్ధనలు మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్ధనలు ఫలించాయి. తేజ్‌ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు. కాగా నేడు(అక్టోబర్‌ 15) సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయి తిరిగి ఇంటికి రావడంపై చిరు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉందని, తన పుట్టిన రోజునే సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చాడని తెలిపిన సంగతి తెలిసిందే.