విపత్తులో అండగా నిలబడ్డ మెగా అభిమానులకు థాంక్స్ – చిరంజీవి

కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదవారికి సహాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతి జిల్లాలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి ప్రాణ దాతగా నిలిచాడు. ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు కూడా పాలుపంచుకున్నారు. అయితే వారందరితో సమావేశమయ్యి అభినందించారు చిరంజీవి. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందాను. క‌రోనా భారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు.. హిందూపురం ప్రసాద్, అంబాజీపేట ఎర్రా నాగ‌బాబు, కడప ర‌వి వీరంద‌రినీ కోల్పోయాను.

వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇక ఈ క‌ష్ట కాలంలో తాను అండ‌గా నిలుస్తాన‌ని నా స్నేహితుడు శేఖ‌ర్ ముందుకొచ్చారు. త‌న విరామ స‌మ‌యాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మిస్తాన‌ని అన్నారు. అతడిని ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించాం. స్వామినాయుడు కూడా అతనితో క‌లిసి ప‌ని చేస్తాడు. చెన్నైలో త‌న కెరీర్ సాగుతున్న‌ప్ప‌టి నుంచి శేఖ‌ర్ త‌న‌కు స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. అలాగే రాబోయే కాలంలో కూడా పేద ప్రజలకు అభిమానుల స‌హ‌కారం చెయ్యాలని చిరంజీవి కోరగా.. అభిమానులంతా అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌మాణం చేశారు.